720 x 90

బ్యాంకుల్లో కొత్త రూల్ : ATMలో డబ్బులు డ్రా.. OTP ఎంటర్ చేశారా?

Canara Bank, New rules, OTP, ATM, ATM Frauds
ఎక్కడ చూసినా ఏటీఎం మోసాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఏటీఎం కార్డుదారులకు మస్కా కొట్టి మోసగాళ్లు ఈజీగా డబ్బులు కాజేస్తున్నారు. క్లోనింగ్ కార్డులతో కార్దుదారుల వ్యక్తిగత వివరాలను సేకరించి డబ్బులు డ్రా చేస్తున్నారు. అర్ధరాత్రి దాటాక ఎక్కువగా ఏటీఎంల్లో చోరీలుకు పాల్పడుతున్నారు. ఏటీఎంల్లో మోసాలను అడ్డుకునే దిశగా కెనెరా బ్యాంకు చర్యలు చేపట్టింది. ఏటీఎంలో జరిగే ఘరానా మోసాలను అడ్డుకునేందుకు కెనెరా బ్యాంక్ ఓ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయాలంటే ఇకపై OTPతప్పనిసరి చేసింది. కార్డు గీకాలంటే.. ఓటీపీ తప్పనిసరి చేసిన ఫస్ట్ బ్యాంక్ కూడా కెనెరా బ్యాంక్.


బ్యాంకు తెచ్చిన కొత్త రూల్ ప్రకారం.. ఏటీఎంల్లో ఒక రోజులో రూ.10వేల కన్నా ఎక్కువగా డబ్బులు డ్రా చేయాలంటే మాత్రం కచ్చితంగా OTP పాస్ వర్డ్ కావాల్సిందే. అప్పుడే పదివేలకు పైగా డబ్బులు ఏటీఎం నుంచి డ్రా చేయడం కుదురుతుంది. అనధికారిక ఏటీఎం నగదు ఉపసంహరణలకు అడ్డుకునేందుకు ఈ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టినట్టు బ్యాంకు ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ కొత్త విధానం ద్వారా ఏటీఎం కార్డు కోల్పోయినా లేదా ఎవరైనా దొంగలు దొంగలించినా, కార్డు పిన్ నెంబర్ తస్కరించినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. పది వేలు.. ఆపై పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరపాలంటే తప్పనిసరిగా ఓటీపీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది.

మీ కార్డును సైబర్ దొంగలు క్లోనింగ్ చేయడం లేదా స్కిమ్మింగ్ చేసినా డబ్బులు దొంగలించడం ఇకపై కుదరదు. రోజు మొత్తంలో రూ.10వేల లోపు విత్ డ్రా చేస్తే ఎలాంటి ఓటీపీ అవసరం ఉండదు. ఒకవేళ పది వేల కంటే ఎక్కువగా డ్రా చేస్తేనే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుందని బ్యాంకు స్పష్టం చేసింది. కెనెరా బ్యాంక్ అందించే MServe అనే యాప్ ద్వారా మీ డెబిట్ కార్డ్ లేదా మీ క్రెడిట్ కార్డ్‌ను వెంటనే ఆఫ్ లైన్ మోడ్ చేయొచ్చు.


Post a Comment

0 Comments